ఐదు జిల్లాల్లో అంధకారం

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాల పలకరింపు మొదలైంది. తొలకరి జల్లులుగా కాకుండా బీభత్సం సృష్టిస్తూ కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. గురువారం సాయంత్రం ఐదు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాజధాని నగరంలో కూడా గురువారం రాత్రి ఈదురు గాలులు మొదలయ్యాయి. నిజామాబాద్, చిత్తూరు, ఖమ్మం, అనంతపురం, కరీంనగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
**************************************************************
కేంద్రంలో ప్రతిష్టంభన

*అడ్డం తిరిగిన డిఎంకే
* ప్రమాణ స్వీకారం వాయిదా

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంబన ఏర్పడింది. పదవుల కేటాయింపుతో ఏకీభవించని డిఎంకే అధినేత కరుణానిధి చివరి నిముషంలో అడ్డం తిరగడంతో హస్తినలో గురువారం రాత్రి రాజకీయ పరిణామాల్లో అనూహ్య నాటకీయత చోటు చేసుకుంది. దాంతో ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవాన్ని వాయిదా వేశారు.ఎన్నికల్లోనే తమతో కలిసి పోటీ చేసిన మిత్రపక్షాలకు కొత్త మంత్రి వర్గంలో స్థానం కల్పించే అంశంపై కాంగ్రెస్ నాయకత్వం గురువారం రోజంతా చేసిన తీవ్రమైన కసరత్తు కొలిక్కి రాలేదు. మంత్రి పదవుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. అయినప్పటికీ యూపియే ప్రభుత్వానికి తాము బయట నుంచి మద్దతు ఇవ్వాలని కరుణానిధి నిర్ణయించినట్లు డిఎంకే ఎంపి టిఆర్ బాలు ప్రకటించారు. మంత్రవర్గ నిర్ణయ చర్చల నుంచి డిఎంకే వైదొలగినట్లు ఆయన తెలిపారు. కాగా రాత్రి కూడా డిఎంకే తో చర్చలు కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.

యూపియే విజయంలో కీలకపాత్ర పోషించిన తృణమూల్ కాంగ్రెస్, ద్రావిడ మున్నేట్ర కళగం(డిఎంకే) మిత్రులకు కేటాయించే పదవుల సంఖ్యపై రాత్రి వరకూ ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. కాంగ్రెస్ కీలక నేతలైన ప్రణబ్ ముఖర్జీ, ఎకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ లు మిత్ర పక్ష అధినేతలైన మమతా బెనర్జీ, కరుణానిధిలతో సంప్రదింపులు ముగించిన తరువాత సెవన్ రేస్ కోర్సు రోడ్ లోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసగృహంలో సమావేశమైయ్యారు. శుక్రవారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసే కేంద్ర మంత్రి మండలి సభ్యుల జాబితాను రూపొందించారు. ఈ జాబితాను యూపియే అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం కోసం దానిని అందచేసే లోగా డిఎంకే నుంచి అసంతృప్తి ప్రకటన వెలువడింది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసే కార్యక్రమం కూడా వాయిదా పడింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మన్మోహన్ తో సహ 27 మంది కేబినెట్ మంత్రులు, 37 మంది సహాయ మంత్రులు తో జాబితాను రూపొందించారు.

**************************************************************
దుష్ప్రచారం వద్దు: చిరు

హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీపైన, పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పైన చేస్తున్న దుష్ప్రచారం వెంటనే నిలిపివేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కొణిదెల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఎవరో కొందరు పనిగట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, అలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉంటే కొంతకాలానికి ప్రజలు అవే నిజమని నమ్మే ప్రమాదం ఉన్నందున తాను మీడియా ముఖంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. తాము డబ్బు చేసుకోవాలని రాజకీయాల్లోకి రాలేదని, నిజంగా మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేయాలనే వచ్చామని ఆయన వివరణ ఇచ్చారు. గురువారంనాడు ప్రజారాజ్యం పార్టీపైన, అల్లు అరవింద్ రాజీనామా చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని, మరో రెండు రోజుల పాటు తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని పిఆర్పీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడారు.

పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగా లేకపోవడం, సామాజిక న్యాయం ఉండాలన్న తపనతో ఎక్కువ మంది వెనుకబడిన తరగతుల వారికి టిక్కెట్లు ఇవ్వాలని పట్టుపట్టి జాబితా రూపొందించడం వల్ల ఆలస్యం అయిందని, తద్వారా పార్టీ అభ్యర్థులు మారుమూల గ్రామాలకు కూడా తమ పార్టీ విధానాలను తీసుకుపోవడంలో వెనుకబడడంతో పార్టీ ఓటమి పాలైందని తమ విశ్లేషణలో వెల్లడైందన్నారు. మోకాలి నొప్పి కారణంగా అరవింద్ తన అనుమతితోనే ఇంటికి వెళితే దాన్ని మీడియా సమావేశం మధ్యలోనే అలిగి వెళ్ళినట్లు, పార్టీకి రాజీనామా చేసినట్లు దుష్ప్రచారం చేయడం తనను విస్మయానికి, ఆవేదనకు గురిచేసిందన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలపై తాము అంతగా స్పందించకూడదని తాము అనుకున్నా మితిమీరిపోతుండడంతో తాను మీడియా సమావేశంలో ఖండించక తప్పలేదన్నారు.



అల్లు అరవింద్ డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. అరవింద్ తనకు ఎంత ముఖ్యుడో, పార్టీలో ఎలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో తనకు తెలుసని, తమ వృత్తి పుణ్యమా అని డబ్బులు దండుకునేంత దుస్థితిలో తాము లేమని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల జాబితా చూస్తే ఎవరికైనా తెలుస్తుందని, నిరుపేదలు, సామాన్యూలకు కూడా తాము టిక్కెట్లు ఇచ్చామని చిరంజీవి వివరించారు. డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చారని ఎవరో కొందరు కావాలనే తమపై అపవాదులు వేస్తున్నారని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా కూడా ఏ విషయాన్నైనా ధ్రువీకరించుకోకుండా ప్రసారం చేయడం మంచిది కాదని చిరంజీవి హితవు పలికారు.

పార్టీ కార్యాలయంలోకి తాను ఎప్పుడూ ప్రవేశించే ద్వారం తెరిచిలేకపోతే ముందు ద్వారం గుండా లోనికి వెళ్ళిన విషయాన్ని కూడా మీడియా తన ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తును మాత్రమే నమ్ముకునేంత బలహీనుడ్ని కాదని, ప్రజల అభిమానాన్ని మాత్రమే నమ్ముతానని చిరంజీవి తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తానని చిరంజీవి చెప్పారు. అలాంటిది ప్రతి విషయాన్ని లేనిపోనివి కల్పించి, అవస్తవాలను ప్రసారం చేయడం, ప్రచురించడం మానుకోవాలని మీడియాకు చిరంజీవి సూచించారు.

తమ పార్టీపైన చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని చిరంజీవి మీడియాకు విజ్ఞప్తి చేశారు. తమ సహనాన్ని అలుసుగా తీసుకొని దుష్ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు.


**************************************************************
మళ్ళీ ఢిల్లీకి వైఎస్‌

హైదరాబాద్‌: ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తోపాటు ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అవుతారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రి వర్గ నిర్మాణంపై ముఖ్యమంత్రి ఆమెతో చర్చిస్తారు.

ఈ చర్చ కొలిక్కి వచ్చి మంత్రి వర్గంపై ఆమోద ముద్ర పడితే అదే రోజు తిరిగి హైదరాబాద్ కు వచ్చేస్తారు. ఈ నెల 25న రాష్ట్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని ముఖ్యమంత్రి గురువారం ఉదయం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ప్రకటించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌లు సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

**************************************************************
వైఎస్ కు బాబు ఫోన్!

హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. గురువారం నాడు వైఎస్ కు ఫోన్ చేసిన చంద్రబాబు ఈ మేరకు అభినందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, టిడిఎల్ పి నాయకుడిగా ఎన్నికైన తరువాత మాత్రమే చంద్రబాబు వైఎస్ కు ఫోన్ చేయడం గమనార్హం.

అంతకు ముందు టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమైన ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు చంద్రబాబునాయుడిని టిడిఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును టిడిపి సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు ప్రతిపాదించగా పార్థసారథి, సత్యవతి రోథోడ్ బలపరిచారు. పార్లమెంటరీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎం.వి. మైసూరారెడ్డిని, టిడిపి ఎల్పీ ఉప నాయకులుగా నాగం జనార్ధన్ రెడ్డి, కె.ఇ. కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు ఎన్నికయ్యారు.

**************************************************************
డిజిపిగా మళ్ళీ యాదవ్

హైదరాబాద్ : రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గా ఎస్ ఎస్ పి యాదవ్ మళ్ళీ నియమితులయ్యారు. ఇంతవరకూ ఈ పదవిలో ఉన్న ఎకె మహంతికి స్థానచలనం కలిగిస్తూ సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. ఈ మేరకు గురువారంనాడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, మరో నలుగురు ఐపిఎస్ లకు కూడా రాష్ట్రప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు డిజిపి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కు అనుకూలంగా మాట్లాడారన్న అభియోగంపై విధుల నుంచి తప్పించి మహంతికి డిజిపి బాధ్యలు అప్పగించింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ తొలగిపోవడం, రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆయన పదవిలో పునర్నియమితులయ్యారు. దీనితో రాష్ట్రంలో రెండు సార్లు డిజిపిగా నియమితుడైన వ్యక్తిగా యాదవ్ రికార్డులకెక్కారు.

ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ పక్కన పెట్టిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నాగిరెడ్డిని కూడా అదే స్థానానికి పంపించింది. ఇంతవరకూ ఆ విధులు నిర్వర్తిస్తున్న చారుసిన్హాను డిజిపికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. విశాఖ రేంజ్ ఐజి వెంకటేశ్వరరావును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులను ఎన్నికల సంఘం పక్కన పెట్టేసింది. బదిలీ అయిన వెంకటేశ్వరరావును కూడా డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాగా, తనను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేయడంపై వ్యాఖ్యానించేందుకు ఎ.కె. మహంతి నిరాకరించారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థపై తాను రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కలిగించగలిగినట్లు మహంతి చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో తాను నిర్వహించిన విధులు సంతృప్తినిచ్చాయన్నారు. భవిష్యత్తులో పేదలకు న్యాయం అందించేందుకే తాను లా కోర్సు చదువుతున్నట్లు మహంతి తెలిపారు.

**************************************************************
'రాజ్యం'లో అల్లు కల్లోలం?

హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీలో ముసలం పుట్టిందా? ఇటీవలి ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురవడంతో ప్రజారాజ్యంలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఈ క్రమంలో గురువారంనాడు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై కూలంకషంగా చర్చించింది. సమావేశంలో పార్టీ ఓటమికి ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ వ్యవహార శైలి కారణం అంటూ సీనియర్లు ఎండగట్టేందుకు యత్నించినట్లు సమాచారం. దీనితో అలక వహించిన అల్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

సుమారు మూడు గంటల పాటు జరిగిన పిఆర్పి పి.ఎ.సి. సమావేశం అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడకుండా విసురుగా వెళ్ళిపోయారు. అయితే, అల్లు రాజీనామా చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే కాని ఎంతమాత్రమూ నిజం లేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సీనియర్ నాయకులెవరూ కూడా అరవింద్ పైన ఎలాంటి ఆరోపణలూ చేయలేదని వారు స్పష్టం చేశారు.

పిఆర్పీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభం కాగానే సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్, పి.ఉపేంద్ర తదితరులు అరవింద్ వ్యవహారంపై నిలదీసినట్లు సమాచారం. కాగా, పిఆర్పీ సీనియర్ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పార్టీ కార్యాలయానికి వచ్చినప్పటికీ అతి ముఖ్యమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొనలేదు. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా మాట్లాడే జోగయ్య పిఎసి సమావేశానికి ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్నకు ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, జోగయ్యనే ఆ విషయం అడిగి తెలుసుకుందామన్నారు. సమావేశం నుంచి ముందుగానే బయటికి వెళ్ళిపోవడంతో పిఆర్పీలో ముసలం పుట్టినట్లు సమాచారం లీకైంది. సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కూడా పిఆర్పీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నుంచి మధ్యలోనే బయటికి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.


భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలోనే ప్రస్తుత కమిటీలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరించాలని సీనియర్ నాయకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తన వైఖరిని సీనియర్లు ఎండగట్టడాన్ని సహించలేని అల్లు అరవింద్ ఒకానొక దశలో పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, అయితే, వేచి చూడమని చిరంజీవి అన్నట్లు సమాచారం.

సమావేశం అనంతరం పిఆర్పి ప్రధాన కార్యదర్శి తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో ఎలాంటి విభేదాలూ తలెత్తలేదని, కమిటీ రేపు కూడా మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు చెప్పారు. అల్లు అరవింద్ రాజీనామా చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అయితే, పార్టీ వైఫల్యానికి తామంతా సమష్టిగా బాధ్యత వహిస్తున్నామన్నారు.

అరవింద్ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలే పార్టీ ఓటమికి కారణం అని సీనియర్లు ఆరోపించారు. సమావేశం మొదట్లోనే జోగయ్య పేచీ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయినట్లు సమాచారం. తెలంగాణలో ఎక్కువ సీట్లు తీసుకున్న దేవేందర్ గౌడ్ రాజీనామా చేయాలంటూ ఒక సందర్భంలో సీనియర్ నాయకులు వత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కమిటీలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరించాలని చిరంజీవికి అధికారం ఇస్తూ సమావేశం తీర్మానించినట్లు తెలుస్తోంది.

**************************************************************
రాజీవ్ కు జాతి నివాళి


న్యూఢిల్లీ : దివంగత భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 18వ వర్ధంతి సందర్భంగా దేశం యావత్తూ ఆయనకు నివాళులు అర్పించింది. రాజీవ్ సతీమణి, ఎఐసిసి అధ్యక్షురాలు, ఉపా చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక వదేరా గురువారం ఉదయాన్నే న్యూఢిల్లీలోని శక్తుఘాట్ లో ఉన్న రాజీవ్ సమాధి వద్ద అంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ కూడా శక్తి ఘాట్ ను సందర్శించి దివంగత నేతకు నివాళులు అర్పించారు.

ఇలా ఉండగా రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకొని గురువారంనాడు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేకదినం పాటిస్తున్నారు. ఉగ్రవాదం ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని దీనిని ఉద్దేశించారు. ఉగ్రవాద వ్యతిరేకదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో.. :
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, పలువురు ఇతర కాంగ్రెస్ నాయకులు అంజలి ఘటించారు. మన దేశంలో సాంకేతిక విజ్ఞానం అభివృద్ధికి రాజీవ్ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.

గాంధీ భవన్ లో.. :
దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేకదినంగా పాటిస్తామని, మత తత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామంటూ పార్టీ కార్యకర్తల చేత పిసిసి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకొని పాతబస్తీలోని చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సద్భావన యాత్రలో డిఎస్ ఈ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొని ప్రమాణం చేశారు.

**************************************************************
'మీడియాను బట్టే మా విధానం'

హైదరాబాద్ : రాష్ట్రంలో మీడియా వ్యవహరించే తీరును బట్టే తమ ప్రభుత్వ విధానం ఉంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. 'కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వంలో మీడియా పట్ల వైఖరి మారే అవకాశం ఉందా?' అన్న మీడియా ప్రశ్నకు వైఎస్ 'రిసిప్రోకల్' అంటూ స్పందించారు. రెండో సారి ముఖ్యమంత్రిగా వైఎస్ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బషీర్ బాగ్ లోని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ప్రజలను నిరంతరం వేదనకు గురిచేస్తున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఒక యంత్రాంగం ఉంటుందని, వాటిని అదుపు చేసేందుకు తాము మరింత దీక్షగా కృషిచేస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. టెర్రరిజం, నక్సలైట్ సమస్య రాష్ట్రంలో పూర్తిగా సమసిపోయిందని తాము అనుకోవడం లేదని, వాటి పరిష్కారానికి మరింత సమర్ధంగా పనిచేస్తామన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం ద్వారా మాత్రమే ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే అనర్ధాలను అరికట్టగలమని వైఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపిగా ఎస్ ఎస్ పి యాదవ్ నియామకాన్ని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. యాదవ్ నియామకం వెనువెంటనే అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి సమస్య ఎదురైనా తాము వెనువెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామన్నారు. వారి కోసం ఒకవేళ కేంద్రానికి ఏవైనా సిఫార్సులు చేయాల్సి వచ్చినా వెనుకాడకుండా వేగంగానే ప్రతిస్పందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు వైఎస్ బదులిస్తూ ఆ జిల్లాలోని 85 శాతం గ్రామాలకు మంచినీటి సరఫరాను ఇప్పటికే చేస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనకు తమ ప్రభుత్వం ఇప్పటికే చాలా కృషి చేసిందని, మరో రెండేళ్ళలో అక్కడ ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా రూపుమాపుతామని వైఎస్ ప్రకటించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపిస్తామని వైఎస్ మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. పార్టీకి మేలు చేసిన వారిని మరిచిపోయే ప్రశ్నే లేదన్నారు. అతి త్వరలోనే నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తామని వైఎస్ వెల్లడించారు. తెలంగాణ సంపూర్ణ, సత్వర, అభివృద్ధికి తాము కృషిచేస్తామని రాజశేఖరరెడ్డి తెలిపారు. తెలంగాణ సమస్యలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, తెలంగాణకు ఏది మంచో దానిని తాము తప్పకుండా చేస్తామని మరో ప్రశ్నకు వైఎస్ జవాబు చెప్పారు.

**************************************************************
`టి' సెంటిమెంట్ ఎంత?

హైదరాబాద్ : తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రత్యేక తెలంగాణ అంశం పరిష్కారానికి సూచన కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణను సాధిస్తామని ఏర్పాటు చేసిన పార్టీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తెలంగాణా అన్ని ప్రాంతాలలోనూ ఒకేలా లేదని, ఉత్తర తెలంగాణాలో కొంత బలంగా ఉందని ఆయన విశ్లేషించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్లొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియూడబ్ల్యుజె) నిర్విహించిన ఈ కార్యక్రమాన్ని ఐజెయు సెక్రటరీ జనరల్ శ్రీనివాసరెడ్డి నిర్వహించగా, సభకు యూనియన్ అధ్యక్షుడు డి.సోమసుందర్ అధ్యక్షత వహించారు.

ప్రత్యేక తెలంగాణా అంశంపై అనేక మంది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తెలంగాణా ప్రజల సెంట్ మెంట్ ను నాయకులు స్వంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారని వైఎస్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 1999లో కె.చంద్రశేఖర రావుకు ప్రాధాన్యత ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టి ఉంటే అసలు తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ పుట్టి ఉండేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణా ప్రజలను ప్రత్యక్షంగానే అడిగానని, ఇంతవరకూ ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వలేదని వైఎస్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నాయకత్వ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని వివరించారు. `అంతేకాదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 17 లోక్ సభ స్థానాలు ఉంటే 12 సీట్లలోనూ, 119 అసెంబ్లీ స్థానాల్లో 50 సీట్ల లోనూ కాంగ్రెస్ ను గెలిపించారు. తెలంగాణాలో అత్యధిక స్థానాలు గెలిచిన ఏకైక పెద్ద పార్టీగా కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఆదరించారు' అని ఆయన చెప్పారు.

నిజంగా ప్రజలు బలంగా కోరుకుంటే, సెంటిమెంట్ ను కాంగ్రెస్ గౌరవించి తీరుతుందని వైఎస్ తెలిపారు. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా ఉత్పన్నమయ్యే ఇతర సమస్యల పరిష్కారంలో సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ సమస్య ఒక్కటే సమస్య కాదని, తెలంగాణ ప్రాంతాన్ని సమగ్రంగా,సత్వరంగా అభివృద్ధి చేయడం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించడం తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తెలంగాణ ప్రముఖ నాయకులకు కొత్త ప్రభుత్వంలో ఇచ్చే ప్రాధాన్యతను గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, కాని వారి అర్హతలను బట్టి తప్పక వారికి ఆదరణ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవులపల్లి అమర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి వై నరేంద్రరెడ్డి, హౌసింగ్ సొసైటీ నాయకుడు నేమాని భాస్కర్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.



**************************************************************

విశ్వాసమే కాంగ్రెస్ విజయం


హైదరాబాద్ : ధైర్యం, విశ్వసనీయతే కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన కారణం అని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. తమది ధైర్యవంతమైన ప్రభుత్వంగా ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయాల్సి వచ్చినప్పుడు తాము విశ్వాసంతో పాటు ధైర్యంగా ముందడుగు వేస్తామని నమ్మారని అందుకే తమ పార్టీకి రెండో సారి కూడా అఖండ విజయం చేకూర్చిపెట్టారని వైఎస్ విశ్లేషించారు. బషీర్ బాగ్ లోని ఎ.పి. జర్నలిస్టుల యూనియన్ ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో రాజశేఖరరెడ్డి మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళుగా తాము గత ఐదేళ్ళూ వ్యవహరించామని, ఇకపైన కూడా వాటిని నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ఒకే ఒక్క ఎజెండాతో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేసినా వాటన్నింటికన్నా తమకు 1.8 శాతం ఓట్లు అధికంగా రావడం తమ ఘన విజయంగా వైఎస్ అభివర్ణించారు. డబ్బు ఖర్చుకు వెనుకాడకుండా, మరో ఆలోచన చేయకుండా పేదలకు మేలు చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తాము ధైర్యంగా ముందడుగు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నింపిన విశ్వాసానికి - ప్రతి పక్షాల వంచనకు మధ్య పోటీగా వైఎస్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను వంచన చేసిందని వైఎస్ వ్యాఖ్యానించారు. 2004లో ఎన్నికైనప్పుడు తాము వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామంటే రైతులు కరెంట్ తీగలను పట్టుకోవచ్చని వెటకారం చేసిన టిడిపి నాయకులే ఇప్పుడు 'ఆల్ ఫ్రీ' అంటూ చేసిన వాగ్దానాలను నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారన్నారు. అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేసి అందలం ఎక్కాలనుకున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో తిప్పికొట్టారని ముఖ్యమంత్రి అన్నారు.


అభివృద్ధిలో జలయజ్ఞాన్ని, సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన తెలిపారు. నిరుపేదలకు అన్ని రకాల మేళ్ళు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సిఎం చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు తాము చేసింది రెండే వాగ్దానాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతూ బుధవారంనాడే ఫైలుపై సంతకం చేసిన విషయాన్ని ఉటంకించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రెండు రూపాయల కిలో బియ్యం కోటాను 20 నుంచి 30 కేజీలకు పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. పెంచిన విద్యుత్ సరఫరాను వెనువెంటనే, బియ్యం పెంపును మాత్రం అక్టోబర్ నుంచి అమలు చేస్తున్నట్లు వైఎస్ చెప్పారు.

ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన మద్దతు ఇవ్వాలని వైఎస్ విజ్ఞప్తి చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆయన చెప్పారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని కూడా వారికి సూచించామన్నారు. అధికారం ఇస్తే మరింతగా మేలు చేయవచ్చని, అది దేవుడు, ప్రజలు తమకు ఇచ్చిన వరంగా భావిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత పటిష్టంగా నిరాటంకంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామన్నారు.

**************************************************************
అంబర్ పేటలో బిజెపి గెలుపు

హైదరాబాద్ : నగరంలోని అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, 12వ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిని సత్యవతి గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలిచారు. తునిలో ఓటమి దిశగా యనమల రామకృష్ణుడు అడుగులు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టిడిపి అభ్యర్థి సుద్దాల దేవయ్య విజయం సాధించారు.

***************************************************************

స్పీకర్ సురేష్ రెడ్డి ఓటమి

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ మహాకూటమి అభ్యర్థి అన్నపూర్ణమ్మ విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులునాయుడు విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో సిపిఐ అభ్యర్థి గుండా మల్లేష్ గెలిచారు.
***************************************************************
చిరుకు దేశం గాలం

హైదరాబాద్ : ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర నుంటి అధికారంలోకి రావడం కోసం మహా యత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే రాయబారాలను ప్రారంభించింది. ఫలితాలు హంగ్ దిశగా దూసుకుపోతుండటంతో కొత్త పొత్తుల ఎత్తుగడలకు తెరతీసింది. ప్రజారాజ్యం పార్టీ మద్దతు కోసం శనివారం పావులు కదిపింది. సినీ పరిశ్రమలో చిరంజీవకి సన్నిహితులైన నిర్మాత అశ్వనీదత్ ను, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులను ప్రత్యేక దూతలుగా చిరంజీవితో చర్చలకు పంపించింది. ఈ ఇద్దరు సినిమా పెద్దలూ ఈ వార్త రాసే సమయానికి చిరంజీవితో చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందకు సహకరించాలని వారు కోరుతున్నారు.

***************************************************************
ఆధిక్యంలో నాగం

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి 3,900 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కడప జిల్లా రాజంపేటలో టిడిపి అభ్యర్థి అధిక్యంలో కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి అభ్యర్థఇ గాలి ముద్దు కృష్ణమనాయుడు ముందంజలో ఉన్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి విజయం సాధించారు. రాజానగరంలో టిడిపి అభ్యర్థి గెలిచారు.
***************************************************************
ఓటమిని ఒప్పుకున్న బిజెపి

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఉపా) అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం, ఉపాకు గట్టి పోటీ ఇవ్వగలదని భావించిన ఎన్డీయే బాగా వెనుకబడిపోవడంతో బిజెపి ఓటమిని అంగీకరించకతప్పలేదు. ఎన్నికల ఫలితాలలో మాకంటే ఉపా ముందంజలో ఉందన్న విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం అని బిజెపి నాయకుడు బల్బీర్ పుంజ్ చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు బిజెపికి ఒక గుణపాఠంగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు తమకు దిగ్భ్రాంతి కలిగించాయని కూడా ఆయన చెప్పారు.
***************************************************************
జీవన్ రెడ్డి అవుట్

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, మంత్రి టి.జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్. రమణ చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. వరంగల్ జిల్లా ములుగులో సీతక్క విజయం సాధించారు. మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యం రెడ్డి 1583 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో దూసుకుపోతున్నారు. టిడిపి నాయకుడి చాలా ఎళ్ళుగా కొనసాగిన ముత్యంరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ చేరారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. కరీంనగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం సాధించారు.
***************************************************************
జీవన్ రెడ్డి అవుట్

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, మంత్రి టి.జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్. రమణ చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. వరంగల్ జిల్లా ములుగులో సీతక్క విజయం సాధించారు. మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యం రెడ్డి 1583 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో దూసుకుపోతున్నారు. టిడిపి నాయకుడి చాలా ఎళ్ళుగా కొనసాగిన ముత్యంరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ చేరారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. కరీంనగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం సాధించారు.
**************************************************************
కాంగ్రెస్ కే కొంచెం మొగ్గు

హైదరాబాద్ : తీవ్రమైన ఉత్కంఠను రేపుతూ వెలువడుతున్న ఫలితాల సరళిలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం వైపు ప్రయాణిస్తూ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. అయితే కూటమిగా తెలుగుదేశం కూడా పెద్ద పక్షంగా నిలవబోతోంది. శనివారం ఉదయం 11-15 నిమిషాలకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టి 138 స్థానాల్లోనూ, తెలుగుదేశం 101 స్థానంలోనూ, తెరాస 13 స్థానాల్లోనూ, కమ్యూనిస్టులు 6 స్థానాల్లోనూ ఆధిక్యంలో వున్నారు. కాగా ప్రజారాజ్యం పార్టీ 22 రెండు స్థానాల్లోనూ, ఇతరులు 15 స్థానాల్లోనూ ఆధిక్యంలో వున్నారు. బోథ్, జగిత్యాలలో తెలుగుదేశం, సనత్ నగర్, రాజోలు, దుబ్బాక, స్టేషన్ ఘన్ పూర్, గంగాధర్ నెల్లూరులో కాంగ్రెస్, బాల్కొండలో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించాయి.

***************************************************************
కళ తప్పిన పార్టీ ఆఫీసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు కళ తప్పి వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచిపోవడం ఖాయం అని ధీమాగా ఉన్న పార్టీలకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏర్పడ్డ మహా కూటమి కాంగ్రెస్ తో పోటా పోటీగా సీట్లు గెలుచుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితి కనిపించడంతో తెలుగుదేశం పార్టీ లో ఉత్సాహం కనిపించలేదు. ఇక, అధికారం మాదేనని బీరాలు పలికిన ప్రజారాజ్యం పార్టీ కేవలం రెండంకెల స్థానాలకే పరిమితం అయ్యేలా ఉంది. మహాకూటమిలో తెలుగుదేశం తర్వాత అతిపెద్ద భాగస్వామి అయిన తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)ని ఈ ఎన్నికలు కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. 45 స్థానాలలో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 14 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

ఈ నేపథ్యంలో శనివారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటల అనంతరం ఇక్కడి జూబ్లీ హిల్స్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, తెలంగాణా రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ఉన్న తెలంగాణా భవన్, ప్రజారాజ్యం పార్టీ కార్యాలయాలు కళ తప్పి బోసిపోయి కనిపించాయి. తెలుగుదేశం పార్టీ సొంతంగా 100కు పైగా స్థానాలలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ ఆ పార్టీ కార్యలయం వద్ద ఎలాంటి సందడి కనిపించలేదు. ఇక తెలంగాణా భవన్ వద్ద మీడియా ప్రతినిధుల హడావిడి తప్ప తెరాస కార్యకర్తల జాడ లేదు. పైపెచ్చు తెలంగాణా భవన్ లోకి ప్రవేశించకుండా కౌంపౌండ్ వాల్ గేట్ కు తాళాలు బిగించడం విశేషం.


****************************************************************
గాంధీ భవన్ లో సంబరాలు

హైదరాబాద్ : ఓట్ల లెక్కింపు ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెలువడుతుండడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా, అనేక చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతుండడంతో కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించుకుంటున్నారు. డప్పు చప్పుళ్ళు, డ్యాన్స్ లతో గాంధీ భవన్ ప్రాంతం మారుమోగుతోంది. అక్కడు ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది.

**************************************************************
శశిధర్ రెడ్డి విజయం

హైదరాబాద్ : సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి విజయం సాధించారు. 8 వేల ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి పద్మారావుపై శశిధర్ రెడ్డి గెలిచారు. చిత్తూరు జిల్లా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సి.కె. బాబు గెలిచారు. ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెనుకంజలో ఉన్నారు. కూకట్ పల్లిలో గెలుపు దిశగా జయప్రకాశ్ నారాయణ్ కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో డిప్యూటీ స్పీకర్ జి. కుతూహలమ్మ విజయం సాధించారు.

***************************************************************
పిఆర్పీ బోణీ

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి పిఆర్పీ అభ్యర్థి వై అనిల్ 7 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పిఆర్పీకి అనుకూలంగా వచ్చిన తొలి ఫలితం ఇది.

***************************************************************
ఓటరు ఆదరణ ఒక్కటే

హైదరాబాద్ : తెలంగాణ మాది..., రాయలసీమ నాది..., ఉత్తరాంధ్ర మా కంచుకోట... కోస్తాంధ్ర మాకు పెట్టనికోట అని బాజాలు వాయించుకున్న పార్టీలకు తెలుగు ఓటరు తిరుగులేని తీర్పు చెప్పారు. సామాజిక వర్గాల వారిగా కుల ప్రాతిపధికన కోస్తాంధ్రలో బలంగా వున్నామని గొప్పలు చెప్పుకున్న ప్రజారాజ్యం పార్టీకి చుక్కెదురైంది. తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రజారాజ్యం ప్రాభవం కనిపించలేదు. కుల ప్రభావం అతి తీవ్రంగా వుండే కోనసీమ లోనే ఆ పార్టీని ఓటర్లు ఆదరించలేదని ఫలితాల తీరు చెబుతోంది. ఇక తెలంగాణాలో గంపగుత్తగా గెలవబోతున్నామని ఆర్భాటంగా ప్రకటించిన మహా కూటమి నేతలకు కూడా ఎదురు దెబ్బ తప్పలేదు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఊహించినదానికంటే ఎక్కువగానే ఆదరించారని ఓటర్ల తీర్పు తెలుపుతోంది. రాయలసీమలో కాంగ్రెస్ ను కాదని, తెలుగుదేశం కూడా సమానంగా దూసుకుపోతోంది.

**************************************************************
కడియం ఓటమి

హైదరాబాద్ : వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
****************************************************************
మూడో స్థానంనలో చిరు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన స్వంత నియోజకవర్గం పాలకొల్లులో వెనకంజలో ఉన్నారు. తాజాగా ఆయన మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ముందంజలో దూసుకు పోతోంది.
************************************************************************************
అసదుద్దీన్ ఎదురీత

హైదరాబాద్ : హైదరాబాద్ లోక్ సభా స్థానంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మహాకూటమి అభ్యర్థి జాహెద్ అలీ ఖాన్ కంటే వెనుకబడి ఉన్నారు. సికింద్రాబాద్ లోక్ సభా స్థానం నుంచి బిజెపి అభ్యర్థి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
****************************************************************
ఓటమిని ఒప్పుకున్న బిజెపి

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఉపా) అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం, ఉపాకు గట్టి పోటీ ఇవ్వగలదని భావించిన ఎన్డీయే బాగా వెనుకబడిపోవడంతో బిజెపి ఓటమిని అంగీకరించకతప్పలేదు. ఎన్నికల ఫలితాలలో మాకంటే ఉపా ముందంజలో ఉందన్న విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం అని బిజెపి నాయకుడు బల్బీర్ పుంజ్ చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు బిజెపికి ఒక గుణపాఠంగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు తమకు దిగ్భ్రాంతి కలిగించాయని కూడా ఆయన చెప్పారు.
***************************************************************
చింది : కేసీఆర్ 15, May 2009

హైదరాబాద్ : ఎన్నికలు పూర్తవగానే ఆనైతిక ప్రకటనలు చేసింది వామపక్షాలేనని, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ వ్యాఖ్యలు చేసింది కమ్యూనిస్టు నాయకులేనని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విమర్శించారు. మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టులు ఎవరిని సంప్రదించి అలాంటి ప్రకటనలు చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో వామపక్షాలు పరస్పర అవగాహనకు తూట్లు పొడిచి తెరాసను ముంచాయని ఆయన ఆరోపించారు. తాను ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంపై మాట్లాడే కనీస నైతిక హక్కు వామపక్షాలకు లేనే లేదని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం ఇక్కడకు వచ్చిన కేసిఆర్ తెలంగాణా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెరాస వరకూ ఒకటే విధానమని అది తెలంగాణాకు ఏది మేలు చేస్తే దానినే తెరాస మంచిగా భావిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక తెలంగాణా గురించి ప్రస్తావించి, కేంద్రంలో ప్రభుత్వం వస్తే వంద రోజుల్లో తెలంగాణా ఇస్తామన్న ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం తప్పెలా అవుతుందని ఆయన అడిగారు. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో మహకూటమి ఉనికి ఉన్నదీ లేనిదీ శనివారం ఫలితాలు వచ్చిన తరువాత చెబుతానని కేసిఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాలు, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం వేరువేరు అంశాలని ఆయన వివరించారు. కేంద్రంలో తాను ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం తెలంగాణా సాధన కోసమేనని, రాష్ట్రంలో తాను ఎవరిని బలపరచేది ఫలితాలు వచ్చిన తరువాతే వెల్లడిస్తానని, ఏమైనా శనివారం సాయంత్రం రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేడివేడిగా ఉంటాయని, అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశమూ ఉందని ఆయన సస్పెన్స్ కు తెరతీసారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ దేనికి మద్దతు ఇస్తుందో తనకు సంబంధం లేదని, తమవి స్వతంత్ర పార్టీలని, ఎవరి అభిప్రాయాలు వారివని, తమను ఎవరూ నిర్దేశించలేరని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం తధ్యమని కేసిఆర్ పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమికి 225 నుంచి 230 సీట్లు రావడం ఖాయమని, అలానే అనేక పార్టీలు ఎన్డీయే పట్ల మొగ్గు చూపుతున్నాయని ఆయన వివరించారు. యూపియే కు కనీసం 200 స్థానాలు కూడా దక్కవని ఆయన జోస్యం చెప్పారు. పోయినసారి తాను చెప్పినట్టే జరిగిందని, ఈసారీ తాను చెప్పింది జరిగి తీరుతుందని ఆయన ధీమాగా అన్నారు. ఎన్డీయే కు అనుకూలంగా తాను మిత్రులను సంప్రదిస్తున్నాని, అదే విధంగా రేపు ఫలితాలు వచ్చిన తరువాత ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కూడా ఎన్డీయేకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరతానని ఆయన వెల్లడించారు. అసలు తృతీయ కూటమి అనేదే లేదని, అది కేవలం ఊహ మాత్రమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

***************************************************************
4 కల్లా పూర్తి ఫలితాలు' 15, May 2009

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శనివారం సాయంత్రం నాలుగు గంటల్లోగా పూర్తిగా వెల్లడవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు పేర్కొన్నారు. మొత్తం 106 లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి సుబ్బారావు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా సరే లెక్కింపు కేంద్రంలోకి చొరబడేందుకు యత్నించినా, వచ్చినా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు పూర్తి అధికారం ఇచ్చినట్లు ఆయన అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లుగా నియమితులైన 334 మంది శుక్రవారం నాటికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారన్నారు. సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి. సుబ్బారావు మాట్లాడారు. శనివారంనాటి ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు.

శనివారం ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలట్ లెక్కింపు ప్రారంభమై పదిహేను నిమిషాల్లో పూర్తవుతుందని సుబ్బారావు తెలిపారు. ఆ వెనువెంటనే ఈవీఎం




***************************************************************
హైదరాబాద్ లో రేపు 144 15, May 2009

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో శనివారంనాడు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి. ప్రసాదరావు స్పష్టం చేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మొహరిస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి కమిషనర్ శుక్రవారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

నిషేధాజ్ఞల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ జంటనగరాల్లో మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, బెల్ట్ షాపులను తెరచి ఉంచరాదని తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు కమిషనర్ ప్రసాదరావు వివరించారు. విజయోత్సవ ర్యాలీలను కూడా తాము సూచించిన సమయంలో నిర్వహించకూడదని ఆయన హెచ్చరించారు.


***************************************************************

యాష్కీ నిరసన గళం 15, May 2009

హైదరాబాద్ : తెలంగాణలో మహాకూటమే అత్యధిక స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎం.పి. మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీచేయడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నదని యాష్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే లాభిస్తుందని తాను, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతగా నచ్చజెప్పినా పెడచెవిన పెట్టారని ఆయన పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నిరసనగళం వినిపించారు.

పార్టీ అధినాయకుల మొండి వైఖరి ఫలితాన్ని శనివారం అనుభవించబోతున్నామన్నారు. తెరాసను కలుపుకొని వెళ్ళనందుకు శనివారం నాటి ఫలితాల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడబోతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉంటే తమతో తెరాస, సిపిఐ పార్టీలు కూడా కలిసివచ్చేవన్నారు. అయితే, అధిష్టానం అనాలోచిత చర్యల కారణంగా ఇప్పుడు ముప్పు ఏర్పడబోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమైక్య ఆంధ్ర రాష్ట్ర వాదిగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర పడినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అవకాశం చిక్కినప్పుడల్లా మధు యాష్కీ గౌడ్ తెర మీదకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ కోసం తమ పార్టీకే చెందిన విజయవాడ ఎం.పి. లగడపాటితో కూడా మధు యాష్కీ పలుమార్లు వాగ్యుద్ధానికి దిగారు కూడా. లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే ఫలితాలపై తనకు నమ్మకం లేదన్నారు. కాగా, మరో పార్టీ మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆయన అన్నారు.


***************************************************************
'కాంగ్రెస్ సమాధి తథ్యం' 15, May 2009

న్యూఢిల్లీ : తెలంగాణ ఇస్తామంటూ తమను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సమాధి తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. మోసకారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన మరో ప్రశ్నకు జవాబిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఆయన అన్నారు. 300 లోక్ సభా స్థానాల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని, అధికార పీఠం ఎక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము చెప్పేది అక్షరాలా నిజమవుతుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని నాయకులు తమకు హామీ ఇచ్చారన్నారు. ఎన్డీయే పక్షాల్లోని కేవలం బిజెపియే కాకుండా భాగస్వామ్య పక్షాలు తనకు కచ్చితమైన హామీ ఇచ్చినందువల్లే ఎన్డీయేకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావు లేదన్నారు. అందుకే ఎన్డీయే ర్యాలీలో కూడా పాల్గొన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తమకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ముఖ్యమన్నారు. తెలంగాణాకు అనుకూలంగా మద్దతు కూడగట్టేందుకు గత కొద్ది రోజులుగా న్యూఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో కాస్సేపు మాట్లాడారు.

తనను ప్రలోభపెట్టే వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని ఒక ప్రశ్నకు కేసీఆర్ అన్నారు. శనివారంనాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను, ఫలితాలను విశ్లేషించుకుంటూ, భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు.



***************************************************************

జంట పేలుళ్ళపై చార్జిషీట్ 15, May 2009

హైదరాబాద్ : నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లలో జరిగిన జంట బాంబు పేలుళ్ళ కేసుకు సంబంధించి ఆక్టోపస్ పోలీసులు శుక్రవారంనాడు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1207 పేజీల ఈ చార్జిషీట్ లో ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపారు. ఈ జంట బాంబు పేలుళ్ళ కేసుకు సంబంధించి హనీక్, అక్బర్ సాజిక్, అనీల్ సాజిక్, ఫారూక్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్, అనీల్ రజాక్ అనే నిందితులు పరారీలో ఉన్నారని ఆక్టోపస్ అధికారులు చార్జిషీట్ లో వివరించారు. హైదరాబాద్ జంట పేలుళ్ళ కేసుకు సంబంధించి మొత్తం 159 మంది సాక్షులను విచారించిన మీదట ఈ చార్జిషీట్ ను ఆక్టోపస్ రూపొందించింది.

2007 వ సంవత్సరం ఆగస్టు 25 రాత్రి 7 గంటల సమయంలో అత్యంత రద్దీగా ఉన్నప్పుడు దుండగులు లుంబినీ పార్క్ లోను, కోఠిలోని గోకుల్ చాట్ బండార్ వద్ద బాంబులు పేల్చివేశారు. ఈ పేలుళ్ళలో 30 మంది అమాయకులు అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోగా, మరో 150 మంది గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన వారు చికిత్స పొందుతూ మరికొందరు మృత్యువాత పడడంతో ఆ సంఖ్య 43కు చేరుకున్నది.

2008 సెప్టెంబర్ లో ముంబాయి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. లుంబినీ పార్క్, దిల్ షుక్ నగర్ ఫుట్ ఓవర్ వంతెన వద్ద బాంబులు పెట్టిన హనీక్, అక్బర్ సాజిక్ లు వీరిలో ఉన్నారు. కాగా, పేలుళ్ళకు ప్రధాన సూత్రధారి, గోకుల చాట్ వద్ద బాంబు పేల్చిన రియాజ్ భత్కల్ ఇంకా పోలీసులకు చిక్కలేదు.


***************************************************************
చిరు ఓడతారు: లగడపాటి 15, May 2009

హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాలు రెండింటిలోను ఓడిపోతారని, ఆయన బావమరది అల్లు అరవింద్ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో పరాజితుడు అవుతారని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ గురువారం జోస్యం చెప్పారు. పిఆర్పీ మహా అయితే 20 అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలదని, తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి 40 సీట్లు రాగలవని లగడపాటి సూచించారు.

తాను అనుసరించిన శాస్త్రీయ పద్ధతి ఆధారంగా ఈ సూచన చేయగలుగుతున్నానని చెబుతూ, 2004 ఎన్నికలకు ముందు తాను చెప్పిన జోస్యాలు నిజమయ్యాయని లగడపాటి తెలియజేశారు. మీ జోస్యం తప్పితే ఏమి చేస్తారనే ప్రశ్నకు లగడపాటి సమాధానం ఇస్తూ, 'నన్ను నేను సవాల్ చేసుకోవడంలో గాని, నేను చెప్పినదానిపై పందెం కట్టడంలో గాని నాకు విశ్వాసం లేదు. ప్రతిపక్షం నుంచి ఏ ప్రముఖ నాయకుడైనా నన్ను సవాల్ చేస్తేనే నేను స్పందిస్తా' అని తెలిపారు.

అయితే, లగడపాటి రాజగోపాల్ సర్వేతో కాంగ్రెస్ పార్టీలో అందరూ ఏకీభవించడం లేదు. కేంద్రంలో యుపిఎకు సాధారణ మెజారిటీకి కొన్ని సీట్లు తగ్గిన పక్షంలో జాతీయ స్థాయిలో పిఆర్పీ మద్దతు తీసుకోవడానికి పార్టీ కచ్చితంగా ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపి వి. హనుమంతరావు చెప్పారు. వివిధ సంస్థలు, న్యూస్ చానెల్స్ చెప్పిన జోస్యాల ఆధారంగా తాను ఇప్పటికే పిఆర్పీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ తో మాట్లాడానని హనుమంతరావు తెలియజేశారు.



***************************************************************

తెలంగాణ భవన్ కళకళ
15, May 2009

హైదరాబాద్ : రాష్ట్రంలో రసవత్తరంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు మరో కొత్త ఘట్టానికి తెరలేపాయి. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ముందు చూపుతో తమ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముందే జాగ్రత్తపడింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అంతా కలిసి 60 మంది కూడా లేకపోవడంతో అందరితోనూ తెలంగాణ భవన్ లో శిబిరం ఏర్పాటు చేసింది. శనివారం మధ్యాహ్నం ఫలితాలు వెలువడిన అనంతరం గెలిచిన అభ్యర్థులతో శిబిరం కొనసాగించాలని నిర్ణయించింది. శనివారం ఉదయం నుంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తెరాస ముందుగానే ఈ ఏర్పాట్లు చేసుకుంది. పార్టీ అభ్యర్థులను ఒకటి, రెండు రోజుల ముందు నుంచే పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు రప్పించుకున్నది.

ఈ క్రమంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా అందరికీ ఆహ్వానం (అధినాయకుడు కేసీఆర్ ఆదేశం) అందడంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అభ్యర్థుల రాకతో తెలంగాణ భవన్ సందడి సందడిగా మారింది. కాగా, ఢిల్లీ టూర్ లో ఉన్న పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ చేరుకుంటున్నారు.

అలాగే, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ముందస్తు శిబిరాల కన్నా గెలిచిన వారిని కాపాడుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. గెలిచిన ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న వెంటనే మరో పార్టీ వారి కంట పడకుండా శిబిరాలకు చేరవేసే ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలో ప్రజారాజ్యం పార్టీ మరింత జాగరూకత ప్రదర్శిస్తోంది. గెలిచిన తమ పార్టీ అభ్యర్థులపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కన్ను తప్పకుండా పడుతుందని, వారిని ప్రలోభపెట్టే ప్రమాదం ఉందని ఊహించిన ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం ఒక్కొక్కరికి ఒక్కో వాహనం, నలుగురు బాధ్యులను ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయి, ఫలితం వెలువడి గెలిచినట్లు ప్రకటించిన వెంటనే వారిని మూడో కంటికి కనిపించకుండా శిబిరానికి చేర్చే బాధ్యతను ఆ నలుగురు బాధ్యులకు అప్పగించింది. అభ్యర్థులను గెలిపించుకోవడం కంటే వారిని భద్రంగా కాపాడుకోవడం కూడా ఇప్పుడు పార్టీల బాధ్యతగా మారింది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు శిబిరాలు నిర్వహిస్తున్నాయి. శిబిరాల్లో వారికి 'సకల సౌకర్యాలు' కల్పిస్తున్నాయి.


తెలంగాణ భవన్ లో తాము శిబిరం నిర్వహించడం లేదని, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తక్షణ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా చేసుకున్న ఏర్పాటు మాత్రమే అని తెరాస నాయకుడు టి. హరీష్ రావు మీడియాకు తెలిపారు. విజయవాడ లోక్ సభా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఓడిపోవడం ఖాయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. గురువారంనాడు లగడపాటి ప్రకటించిన సర్వే ఫలితాలు తల్లకిందులు కాక తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో ఎవరితోనైనా కలిసేందుకు తాము సిద్ధం అని హరీష్ రావు పునరుద్ఘాటించారు.

ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీని తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయుడితో తమ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు మాట్లాడతారని తెరాస నాయకుడు నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. తమ సర్వే ప్రకారం 30 అసెంబ్లీ స్థానాల్లోను, 7 లోక్ సభా స్థానాల్లోనూ తెరాస విజయఢంకా మోగిస్తుందని నాయిని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ తమ మద్దతు కోరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మరో తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. అయితే, ఫలితాల తరువాత మాత్రమే చర్చించి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


***************************************************************

అల్లర్లు చెలరేగవచ్చు! 15, May 2009


హైదరాబాద్ : ఓట్ల లెక్కింపు రోజు శనివారం (మే 16న) శాంతి భద్రతల సమస్య తలెత్తగలదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ (ఇసి)ని గూఢచారి విభాగం హెచ్చరించింది. కోస్తా జిల్లాలు, పల్నాడు, రాయలసీమలోని పలు ప్రదేశాలు కులాల పరంగా సున్నిత ప్రాంతాలుగా మారాయని, ఏ స్వల్ప వివాదమైనా వర్గాల మధ్య సంఘర్షణలకు దారి తీయవచ్చునని గూఢచారి విభాగం హెచ్చరించింది.

వివిధ కులాల మధ్య స్పర్థలు తీవ్రమయ్యాయి. ఉధృత స్థాయిలో సాగిన ఎన్నికల ప్రచారం గ్రామాలలో సంఘర్షణలు చోటు చేసుకోవచ్చునని సూచిస్తున్నది. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) ఆవిర్భావం అనంతరం చాలా గ్రామాలలో ఇటువంటి పరిస్థితి నెలకొన్నది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నెల 16న విజయోత్సవాలను అనుమతించవద్దని ఇసికి గూఢచారి విభాగం సూచించింది. పోలీస్ బలగం అంతా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడంలో బిజీగా ఉంటుంది కనుక ఇది తప్పనిసరి అని ఈ విభాగం సూచించింది. విజయోత్సవ ర్యాలీలను నిర్వహించవద్దని రాజకీయ పార్టీలన్నిటినీ ఇసి కోరింది. అయితే, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) ఐ.వి. సుబ్బారావుతో సమావేశమైన రాజకీయ పార్టీల నాయకులు ఈ ఆంక్షల పట్ల ఆక్షేపణ తెలియజేశారు.

'మే 16న విజయోత్సవ ర్యాలీలను అనుమతించవలసిందిగా ఇసిని మేము కోరాం. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఆ మరునాడు హైదరాబాద్ కు హుటాహుటిని చేరుకుంటారు. ఇతర పార్టీలు గెలిచిన తమ అభ్యర్థులను ప్రలోభపెట్టకుండా జాగ్రత్త పడేందుకు కొన్ని రాజకీయ పార్టీలు శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి' అని తెలుగు దేశం పార్టీ (టిడిపి) సీనియర్ నాయకుడు కె. విజయరామారావు తెలిపారు. మే 16న ఈ ఆంక్షలను సడలించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ కూడా ఇసిని కోరాయి.

రాజకీయ పార్టీలు ఇందునిమిత్తం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి)ల అనుమతి స్వీకరించాలని ఇసి సూచించింది. అయితే, సున్నితమైన ప్రాంతాలలో విజయోత్సవాలకు, ర్యాలీలకు అనుమతి ఇవ్వవద్దని జిల్లా ఎస్ పిలు అందరికీ ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తున్నది.


***************************************************************

రక్తమోడిన రహదార్లు 15, May 2009

హైదరాబాద్ : శుక్రవారం ఉదయాన్నే రాష్ట్ర రోడ్లు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలోని చీమలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో పది మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న టిప్పర్ - టాటా సుమో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అలాగే మెదక్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జిల్లాలోని చేగుంట మండలం నార్సింగి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్ద జీపు - ఆర్టీసీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో జీపు డ్రైవర్ మరణించాడు. జీపులో ఉన్న ఎమ్మార్వో తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో మరొకరు మరణించారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద లారీలు ఢీనగా ఒకరు మృత్యువాత పడ్డారు.

****************************************************************

`టీ' కాలుతుంది 15, May 2009

అహమ్మదాబాద్ : వేడి వేడి టీ ని గబుక్కున తాగితే నోరు కాలడం మామూలే... అది సరే కాని ఇక నుంచి కప్పు టీ తాగుదామని పదేపదే తహతహలాడితే పర్సు తగలబడిపోగలదు లేదా జేబు ఖాళీ కాగలదు. ఎందుకంటే టీ పొడి ధరను అమాంతం పెంచాలని ఈ వ్యాపారంలో గుత్తాధిపత్యం ఉన్న కంపెనీలు నిర్ణయించాయి. తేయాకు ఉత్పత్తి కొద్దిగా పడటంలో దేశవ్యాప్తంగా 15 నుంచి 20 శాతం దిగుమతులు తగ్గాయి. దాంతో టీ పొడి ధరను కిలోకు కనీసం 20 రూపాయలు పెంచాలని ప్యాకేజర్లు నిర్ణయించారు. ప్రస్తుత ధర కంటే తేయాకు బల్క్ ట్రేడర్లు నలభై శాతం పెంచేశారు. రిటైల్ వ్యాపారులు పెంచడం అనివార్యమైంది. ఉత్పత్తి తగ్గినంత మాత్రాన ధరను పెంచాల్సిన అవసరం లేదని టీ డీలర్స అసోసియేషన్ అధ్యక్షుడు పీయూష్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఏదైతేనేం టీ ప్రియులు కప్పు టీ తాగాలంటే ఈ అదనపు భారం భరించాల్సిందే.

***************************************************************

1.2.3.4.5.6.7.8.9.10.>>